Anil Ambani Sons: భారత్ సహా ప్రపంచంలోని అత్యంత కుబేరుల్లో రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ.. ఒకప్పుడు ముందు వరుసలో ఉండేవారు. ప్రస్తుత భారత కుబేరుడు, ఈయన సోదరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూడా అనిల్ వెనుకే ఉండేవారు. అయితే కాలం వేగంగా కదిలింది. పరిస్థితి మారిపోయింది. తన వ్యాపారాల్ని అలాగే మరింత విస్తరించే క్రమంలో అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోయారు. ఆయనకు చెందిన పలు కంపెనీలు దివాలా పరిస్థితికి పతనమయ్యాయి. దీంతో ఆయా కంపెనీల షేర్లు పడిపోవడం సహా అంతే వేగంగా అనిల్ అంబానీ ఆస్తి కరిగిపోయింది. 2009లో ఒక సమయంలో ఆయన తన సంపదను జీరోగా పేర్కొనడం గమనార్హం.
ఇక గత రెండేళ్లుగా మళ్లీ అనిల్ అంబానీ వార్తల్లో కనిపిస్తున్నాయి. అప్పుడు దివాలా ప్రకటనలతో వార్తల్లో నిలిచిన ఈ బిలియనీర్.. ఇప్పుడు తిరిగి తన వ్యాపారాల్లో రాణిస్తున్నారు. అప్పుల ఊబి నుంచి బయటపడి తిరిగి గాడినపడుతున్నారు. క్రమక్రమంగా బ్యాంకులకు కూడా అప్పుల్ని తిరిగి చెల్లిస్తున్నారు. ఇదే సమయంలో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అనిల్ అంబానీ ఇప్పుడు తన తనయుల పేరిట కొత్త కంపెనీ ప్రారంభించారు.
అనిల్ అంబానీ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రారంభించిన కంపెనీకి కూడా రిలయన్స్ జై ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (RJPPL) పేరు పెట్టారు. అయితే ఈ కంపెనీ పేరులో జై అనేది అనిల్ ఇద్దరు తనయుల ప్రారంభ అక్షరం అని చెప్పొచ్చు. అనిల్ అంబానీ తనయుల పేర్లు.. జై అన్మోల్ అంబానీ, జై అన్షుల్ అంబానీ. ఇప్పుడు అంబానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారన్న విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఆర్జేపీపీఎల్ అనేది రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ సబ్సిడరీ. ఈ కంపెనీ పని వివిధ ఆస్తుల్ని కొనుగోలు చేయడం, విక్రయించడం సహా లీజుకు ఇవ్వడం, అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనుంది. రిలయన్స్ ఎనర్జీ అనేది రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ సంస్థగా ఉంది. అనిల్ అంబానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒక వ్యూహాత్మక అడుగుగా చాలా మంది భావిస్తున్నారు. ఇది ప్రధాని మోదీ డ్రీమ్ ప్లాన్ పని చేస్తుందని తెలుస్తుంది.