అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చిన తొలి మంగళవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజ, జపపారాయణలను నిర్వహించారు. తరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం అర్చకులు ఏకాంతంగా ఈ పూజలన్ని నిర్వహించిన తర్వాత అమ్మవారికి మొదటి విడత సాత్వికబలిగా వందల సంఖ్యలో గుమ్మడి కాయలు, కొబ్బరికాయలలు, నిమ్మకాయలను ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు సమర్పించారు.
మల్లికార్జునస్వామికి మహామంగళ హారతి తర్వాత అమ్మవారి ఉగ్రరూపం స్వామిపై పడకుండా.. పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర శోంటి భక్షాలతో స్వామివారి లింగరూపాన్ని కప్పివేశారు. ఆలయ నియమాల ప్రకారం సాయంత్రం ఆలయ ముఖమండపం ముందు అన్నం రాసిగా పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఘట్టం స్త్రీ వేషధారణలో స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పించడం. ఈ ప్రధానఘట్టం తర్వాత అమ్మవారికి మళ్లీ రెండోవ విడత సాత్విక బలి సమర్పిస్తారు. ఆ తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమాతిస్తారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం కన్నుల పండగగా జరిగింది.