వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 2023లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం విస్మరించిందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి శాసన మండలిలో బుధవారం ప్రకటన చేశారు. మండలిలో వాలంటీర్ వ్యవస్థపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి విరాంజనేయస్వామి, మండలిలో ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య మాటలు యుద్దం నడిచింది.
వాలంటీర్ల వ్యవస్థ, వారికి చెల్లించాల్సిన వేతనాల గురించ వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. దీనికి మంత్రి వీరాంజనేయస్వామి సమాధానం ఇస్తూ.. ఈ వ్యవస్థను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జీవో 5 ద్వారా తీసుకొచ్చిందని, 2023 సెప్టెంబర్‌లో దీనిపై ఎటువంటి ఉత్తర్వులు వెలువరించలేదని తెలిపారు. ఏటా రెన్యువల్ చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. 2023లో మాత్రం ఆ పని చేయలేదని మంత్రి వివరించారు. అసలు ఆ వ్యవస్థనే కొనసాగించలేదని, ఎన్నికల సమయంలో లేనివారితో రాజీనామాలు చేయించారని తెలియజేశారు. మనుగడ లేని వాళ్లను చూపించి ఎన్నికల కోడ్ పేరుతో నాటకాలకు తెరతీశారని ఆరోపించారు.