Ayyanna Patrudu on Narsipatnam RTC Depot land Private Lease issue: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి అయ్యన్న శైలి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి ఆయన. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ముక్కుసూటితనం, ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం ఆయన స్టైల్. అయితే తాజాగా చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్తున్నా కూడా వినకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని అయ్యన్నపాత్రుడు ఆవేశంగా ఉన్నారు. అవసరమైతే స్పీకర్ పదవిని కూడా వదులుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన స్థలాలను లీజుకు ఇవ్వడాన్ని అయ్యన్న పాత్రుడు వ్యతిరేకిస్తున్నారు. ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అయ్యన్నపాత్రుడు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అవసరమైతే స్పీకర్ పదవినైనా వదులుకుంటానని.. నర్సీపట్నం డిపోలో ఉన్న ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వడాన్ని మాత్రం అంగీకరించేది లేదని అయ్యన్న స్పష్టం చేశారు. శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించిన అయ్యన్నపాత్రుడు.. పెద్దఎత్తున మట్టిని తరలిస్తుంటే ఆర్టీసీ సెక్యూరిటీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రోడ్డు మీద ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.
మరోవైపు ఆర్టీసీ డీఎం ధీరజ్‌కు తాను నాలుగుసార్లు ఫోన్ చేశానన్న అయ్యన్నపాత్రుడు.. తాను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదని మండిపడ్డారు. రైతులు, ప్రజల అవసరాల కోసం భూమి ఇచ్చారన్న అయ్యన్నపాత్రుడు.. వ్యాపార అవసరాల కోసం ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు, మల్టీ కాంప్లెక్స్ నిర్మాణానికి లీజుకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాను వద్దంటున్నా కూడా అధికారులు ఎందుకు లీజుదారులకు సహకరిస్తున్నారని అయ్యన్న వారిని నిలదీశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతానన్న అయ్యన్నపాత్రుడు.. అవసరమైతే అసెంబ్లీలో చర్చకు పెడతానని అన్నారు. అంతేకాదనీ ఈ విషయంలో తగ్గేది లేదంటున్నారు అయ్యన్న.