ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీపావళి నుంచే దీపం 2.0 పథకం కింద ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి దీనికి అనూహ్య స్పందన వస్తోంది. నియోగదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం నమోదు చేసుకోవటంతో పాటుగా.. సిలిండర్ బుక్ చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనం పొందుతున్నారు. అయితే కొన్ని చిన్న, చిన్న పొరబాట్ల కారణంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కింద పొందిన సిలిండర్లు కోల్పోయే ప్రమాదం ఉంది.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అధికారులు గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. హోటళ్లు, సిలిండర్ ఫిల్లింగ్ షాపులలో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా వాడుతున్న 35 సిలిండర్లను సీజ్ చేశారు. అయితే ఇందుకో కారణం ఉంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సిలిండర్లను గృహ అవసరాల మేరకే వినియోగించాలి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు. ఇళ్లల్లో మాత్రమే వాడుకోవాలి. రెస్టారెంట్లు, హోటళ్ల వంటి కార్యకలాపాల కోసం వాణిజ్య సిలిండర్లు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే కొంతమంది వ్యాపారులు సబ్సిడీ మీద అందించే వంట గ్యాస్ సిలిండర్లను పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి..వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిన పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సిలిండర్లు సీజ్ చేశారు. అలా అక్రమంగా వాడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. సిలిండర్లు సీజ్ చేయటంతో వాటిని తిరిగి పొందే అవకాశం ఉండదు. అలాగే ఉచిత గ్యాస్ తీసుకున్న సమయంలో వాటిని హోటళ్లు, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు, రెస్టారెంట్ల వద్ద ఉంచే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే అలాంటి సమయంలో సోదాలు జరిగితే.. ఈ సిలిండర్లను కూడా తీసుకెళ్లిపోయే అవకాశం ఉంది.