ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో పదవులకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. శాసనమండలి, శాసనసభల్లో చీఫ్ విప్‌ల పేర్లను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి బలం ఎక్కువగా ఉండటంతో సమన్వయం కోసం ముందు అక్కడ విప్‌ల నియామకం చేపట్టే అవకాశం ఉంది. ఆ దిశగానే అక్కడ పదవుల భర్తీపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు పేర్లు ఫైనల్ అయ్యాయని చెబుతున్నారు.. చివరి నిమిషంలో మార్పులు జరిగితే తప్ప అవే పేర్లు ఫైనల్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు కీలకమైన శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజాగా కాలవ శ్రీనివాసులు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సభలో చీఫ్‌విప్ పదవికి బెందాళం అశోక్, కూన రవికుమార్ పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ పదవికి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేరు పరిశీలనలో ఉన్నా.. గుంటూరు జిల్లాలో అదే సామాజిక వర్గం నుంచి ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా, మరొకరు కేంద్రమంత్రిగా ఉండటంతో ఆయనకు అవకాశం దాదాపు లేనట్లే అంటున్నారు. శాసనసభలో విప్‌లుగా జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ పేర్లను ఆ పార్టీ అధిష్ఠానం ప్రతిపాదించింది. జనసేన పార్టీ నుంచి మూడో విప్‌గా బొలిశెట్టి శ్రీనివాస్ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.