Chandrababu Delhi Tour: ప్రధానమంత్రి మోదీతో చంద్రబాబు భేటీ.. చర్చించిన విషయాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలతోపాటుగా ప్రధాని మోదీని కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో.. పోలవరం నిధుల మంజూరుపై ప్రధానితో చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకారంపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసింది. అమరావతికి కేంద్రం బడ్జెట్‌లో రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమరావతికి ప్రకటించిన నిధుల విడుదలపైనా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర వాకబు చేసినట్లు సమాచారం. వీటితో పాటుగా వెనకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థికసాయం కింద నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని కోరినట్లు తెలిసింది. సుమారు గంటపాటు జరిగిన భేటీలో ఇంకా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు సమాచారం. అలాగే కొత్త రుణాలపైనా చంద్రబాబు ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. వైఎస్ జగన్ హయాంలో చేసిన రుణాలను రీ షెడ్యూల్ చేయాలని ప్రధానిని కోరినట్లు సమాచారం.

మరోవైపు ప్రధానమంత్రితో భేటీ ముగిసిన తర్వాత.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఆర్థిక మంత్రితో చర్చించారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన సాయం గురించి ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. విభజన హామీలు, ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు, రాజధానికి సహకారం వంటి అంశాలపైనా చర్చించారు. అంతకుముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు గురించి ఆయనతో చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర అంశాలతో పాటుగా పలు రాజకీయ విషయాలపైనా ఇరువురు నేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయి.

About amaravatinews

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *