టీడీపీ, కాంగ్రెస్ పార్టీలంటే ఒకప్పుడు ఉప్పూనిప్పూగా ఉండేవి. టీడీపీ ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఇక మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ పార్టీలు రెండూ దగ్గరయ్యాయి. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా పోటీకూడా చేశాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. మడకశిర మండలం గుండుమల గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు.
ఇక సీఎం చంద్రబాబు నాయుడు మడకశిర పర్యటనపై రఘువీరారెడ్డి స్పందించారు. ” సీఎం నారా చంద్రబాబు నాయుడు మడకశిర రావడం సంతోషకరం. ప్రభుత్వ కార్యక్రమాన్ని బలవంతపు తరలింపు లేకుండా సాదాసీదాగా సభను నిర్వహించడం హర్షణీయం. ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా భవిష్యత్తులో ఇదే తరహాలో కొనసాగిస్తే మంచిదని నా అభిప్రాయం” అంటూ సీడబ్ల్యూసీ సభ్యుడుగా ఉన్న రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. మరోవైపు మడకశిర నియోజకవర్గంలో పదేళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న రైతుల సమస్యలు, తాగు, సాగునీటిపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని రఘువీరారెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రకటన పట్ల మడకశిర వాసిగా హర్షిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడకశిరకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కూటమి ప్రభుత్వానికి శక్తిని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు.
మరోవైపు గురువారం మడకశిరలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతం మీద వరాల జల్లు కురిపించారు. మడకశిరలో రూ.60 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే ఈ ప్రాంతంలో రెండు రిజర్వాయర్లు కడతామని చంద్రబాబు ప్రకటించారు. బిందు సేద్యం విధానం అమలు సహా నూతనంగా పరిశ్రమలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణంతో పాటుగా పంటలకు గిట్టుబాటు ధరపైనా చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో చంద్రబాబును ప్రశంసించారు ఏపీ కాంగ్రెస్ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి. ఇవన్నీ అమలు చేసే శక్తిని ఆయనకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.