వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై రామ్‌గోపాల్ వర్మ మీద ఏపీలో కేసులు నమోదయ్యాయి. దీనిపై ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే విచారణకు హాజరుకాకపోవటంతో రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఉదయం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రామ్‌గోపాల్ వర్మ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రామ్‌గోపాల్ వర్మ కనిపించకుండా పోవటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ కాగా.. ఆర్జీవీ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో రామ్‌గోపాల్ వర్మతో పాటుగా పలువురు నోటీసులు అందుకుని కూడా విచారణకు రాలేదని.. అయితే దీనిపై తాను ఇప్పుడేమీ స్పందించనంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయంలో పోలీసులను వారి పని వారిని చేసుకోనివ్వాలని అన్నారు. హోం శాఖ, శాంతిభద్రతలు తన పరిధిలో లేవన్న పవన్ కళ్యాణ్.. తనకు అప్పగించిన శాఖలపై మాట్లాడాలంటే మాట్లాడతానని చెప్పారు. ఏవైనా ఉంటే అడగాల్సింది సీఎం చంద్రబాబు నాయుడునని చెప్పారు. శాంతిభద్రతల అంశం హోంమంత్రి పరిధిలోదని.. హోం మంత్రి చూస్తారని, తాను చెయ్యడం లేదంటూ నవ్వుతూ బదులిచ్చారు.