తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే దానిపై ప్రాథమిక ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు నేరుగా ఎలా ప్రకటన చేస్తారంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో తాము చెప్పిందే నిజమైందని.. సత్యమేవ జయతే అంటూ వైసీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ స్పందించారు. ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్.. దీక్ష విరమణ కోసం తిరుమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మీడియా సుప్రీంకోర్టు వ్యాఖ్యల విషయాన్ని ప్రస్తావించగా.. పవన్ కళ్యాణ్ రియాక్టయ్యారు.
” కల్తీ జరగలేదని వారెప్పుడూ (సుప్రీంకోర్టు) చెప్పలేదు. వాళ్ల ముందున్న సమాచారం ఆధారంగా ఆ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నా. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పలేదు కదా. తేదీ విషయంలో మాత్రమే కాస్త కన్ఫ్యూజన్ ఉందని అన్నారు. అయితే ప్రసాదం విషయంలో మాత్రమే కాదు.. గత ఐదేళ్లలో ఇలాంటి ఉల్లంఘనలు చాలా జరిగాయి. మా ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుంది. గత 5- 6 ఏళ్లుగా ఏదో ఒక అపవిత్రం జరుగుతోంది. దాదాపు 219 ఆలయాలను అపవిత్రం చేశారు. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది కేవలం ఒక ప్రసాదం గురించి కాదు.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ముందుకు తీసుకువెళ్లాలనే ఈ ప్రాయశ్చిత్త దీక్ష. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు చాలా అవసరం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. నేను ఈ దీక్షను పూర్తి చేసిన తర్వాత, రేపు దీనిపై డిక్లరేషన్ చేస్తాం” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
మరోవైపు తిరుమల లడ్డూ వివాదం మొదలైన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల ఈ ప్రాయశ్చిత్త దీక్ష తిరుమలలో విరమించనున్నారు. రేపు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ ఉంటుంది. అనంతరం తిరుపతిలో వారాహి సభను నిర్వహిస్తారు. ఈ సందర్భంగానే సనాతన ధర్మ పరిరక్షణ కోసం డిక్లరేషన్ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. తిరుమల వెళ్లడానికి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన పవన్.. రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు.