సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు సమ్మె కాలానికి వేతనాలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గతేడాది డిసెంబర్ 20 నుంచి 2024 జనవరి 10 జనవరి వరకూ.. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేశారు. కేజీబీవీలలో పనిచేసే వారితో పాటుగా జిల్లాలు, మండలాల్లోని సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గౌరవ వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల కోసం 21 రోజుల పాటు ఈ సమ్మె చేశారు. అయితే ఈ ఆందోళనల తర్వాత ప్రభుత్వం కేజీబీవీల్లో పనిచేసే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు గౌరవ వేతనాన్ని పెంచింది. వీరికి గౌరవ వేతనాన్ని 23 శాతం పెంచుతూ జనవరిలో మెమో ఇచ్చింది.
అయితే ఈ 21 రోజులు సమ్మె కాలానికి జీతం మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 21 రోజుల కాలానికి వేతనం చెల్లించాల్సిందిగా సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మంత్రి నారా లోకేష్‌ను కలిసి కోరింది. వీరి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్.. 21 రోజులకు జీతం చెల్లింపునకు అంగీకారం తెలుపుతూ సంబంధిత శాఖను ఆదేశించారు. నారా లోకేష్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉద్యోగుల వినతిని మానవతా దృక్పథంతో పరిశీలించి సమ్మెకాలానికి వేతనాలు విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించగా.. ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయంటూ ఉత్తర్వులను షేర్ చేశారు. తమది ప్రజా ప్రభుత్వమని.. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయంపై సమగ్ర శిక్షా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జేఏసీ ఏపీ ప్రభుత్వానికి, మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం 25,000 మంది ఉద్యోగులకు ఆర్థిక భద్రత కలిగిస్తుందని ధన్యవాదాలు తెలియజేసింది. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిన ఈ సానుకూల వైఖరికి, ఆర్థిక సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే సమ్మె కాలంలో జరిగిన ఒప్పందం అమలుపై చర్యలు తీసుకోవాలని కోరింది.