Cricketer Kapil dev meets cm Chandrababu in Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతాల్లో గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. అమరావతి, అనంతపురం, విశాఖపట్నంలో గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. మంగళవారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్, కేశినేని చిన్నితో కలిసి ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటు సహా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కపిల్ దేవ్ ఆ వివరాలను వెల్లడించారు.
క్రీడల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు చాలా ఆసక్తిగా ఉన్నారన్న కపిల్ దేవ్.. గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు చెప్పారు. తాను ఇండియన్ గోల్ఫ్‌కు అధ్యక్షుడిగా ఉన్న విషయాన్ని చెప్పిన కపిల్‌దేవ్.. ఏపీలోనూ గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే భూమి ఎక్కడిస్తారనేదీ ప్రభుత్వ నిర్ణయమని.. కానీ స్పోర్ట్స్ సిటీ ఇస్తే చాలా సంతోషిస్తానని అన్నారు. ఈ సందర్భంగానే.. అనంతపురం, అమరావతి, విశాఖపట్నంలో గోల్ఫ్ కోర్టులు పెట్టనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. రాష్ట్రంలో గోల్ఫ్ అభివృద్ధి చేస్తామన్న కేశినేని చిన్ని.. గోల్ఫ్ డ్రైవింగ్‌కు రేంజ్‌లు సిద్ధం చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంత యువతలో అద్భుత నైపుణ్యాలు దాగి ఉంటాయన్న కేశినేని చిన్ని.. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి క్రికెట్లో వారిని ప్రోత్సహిస్తామన్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal