ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్‌లో ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు డ్యూయెల్ సర్టిఫికేట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు సాధారణంగా ఇచ్చే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్‌తో పాటుగా.. నేషనల్ సెంటర్ ఫర్ ఒకేషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (NCVTE) ధ్రువపత్రం కూడా ఇవ్వనున్నారు. దీంతో ఏపీవ్యాప్తంగా ఇంటర్‌లో ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు రెండు సర్టిఫికేట్లు రానున్నాయి.
నేషనల్ సెంటర్ ఫర్ ఒకేషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ జాతీయ స్థాయిలో వృత్తివిద్యా కోర్సులను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇక ఇది జారీ చేసే సర్టిఫికేట్ ద్వారా విద్యార్థులకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాల్లో చేరాలంటే ఒకేషనల్ కోర్సులు చదివిన విద్యా్ర్థులకు ఈ సర్టిఫికేట్ అవసరం అవుతూ ఉంటుంది. రాష్ట్ర బోర్డు ఇచ్చే ఇంటర్ సర్టిఫికేట్ ద్వారా రాష్ట్రంలోనే ఉద్యోగాలు పొందే వీలు ఉంటుంది. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాల్లో చేరాలంటే NCVTE సర్టిఫికేట్ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా NCVTEతో కలిసి సర్టిఫికేట్లు ఇవ్వాలని ఏపీ ఇంటర్ విద్యామండలి నిర్ణయించింది.