ఏపీలో కొత్తగా భవనాలు కట్టాలనుకునేవారికి ముఖ్య గమనిక. పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఏపీ ప్రభుత్వం నూతన విధానం తీసుకురానుంది. ఈ విషయాన్ని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణాల అనుమతులకు నూతన విధానాన్ని తేనున్నట్లు చెప్పారు. నూతన విధానం ప్రకారం ఇక ముందు ఇంజనీర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల ప్లాన్ ప్రకారమే ఇల్లు, భవనాలు నిర్మించాల్సి ఉంటుందని నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో నారాయణ సమీక్ష జరిపారు. ఈ సమీక్షా సమావేశంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు.
పట్టణాల్లో భవన నిర్మాణాల కోసం లైసెన్స్‌డ్ సర్వేయర్ లేదా ఇంజినీర్లు ప్లాన్ సమర్పిస్తే అనుమతులు ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అయితే ఇంజనీర్లు, సర్వేయర్ల ప్లాన్ ప్రకారమే భవనం కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్మాణ ప్రక్రియను కూడా పురపాలకశాఖ అధికారులు పరిశీలిస్తుంటారన్న మంత్రి.. ప్రభుత్వానికి సమర్పించిన ప్లాన్ ప్రకారం నిర్మాణం లేకుంటే ప్లాన్ సమర్పించిన సర్వేయర్ లేదా ఇంజనీర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఏమైనా తేడాలు వస్తే.. సర్వేయర్, ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి హెచ్చరించారు. భవనాల యజమానులకు ఉపయోగకరంగా ఉండేందుకు గానూ మున్సిపాలిటీలు, శాఖలకు చెల్లించాల్సిన ఫీజులను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించేలా ఏర్పాటు చేస్తామన్నారు.