Uchitha Pantala Bheema: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం.. కీలక నిర్ణయాలకు తెరతీస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాలను పక్కనపెడుతోంది. ఈ క్రమంలోనే రైతులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే పంటల బీమాకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-పంటలో నమోదైతే ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వరకు ఈ-పంటలో నమోదైన పంటలన్నింటికీ ప్రభుత్వమే ఉచిత పంటల బీమాను కల్పించనుంది. ఇక వచ్చే రబీ నుంచి 2019 కంటే ముందు ఉన్న విధానమే.. అంటే ఎంపిక చేసుకున్న రైతులకు మాత్రమే పంటల బీమాను అమలు చేయనుంది.
ఈ నిర్ణయానికి తాజాగా మంత్రివర్గ ఉపసంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే నాటికే పంటల బీమా అమలుకు వ్యవసాయశాఖ టెండర్లు పిలిచింది. దీంతో వచ్చే సీజన్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. 2024-25, 2025-26 సంవత్సరాల్లో ఖరీఫ్, రబీకి సంబంధించి సంస్థలను కూడా ఎంపిక చేసింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకంతో రైతులకు ఒరిగిందేమీ లేదని ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది.
గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా విధానంతో పంటలు దెబ్బతిన్నా రైతులకు పరిహారం దక్కలేదని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయశాఖపై నిర్వహించిన సమీక్షలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో 2019 కి ముందున్న పంటల బీమా పథకాన్నే అమలు చేస్తామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగిసిందని వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి చెప్పడంతో.. వచ్చే సీజన్ నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఖరీఫ్ సాగు మొదలైందని.. మళ్లీ పంటల బీమా అమలుకు టెండర్లు పిలిచి ప్రక్రియ పూర్తి చేసేసరికి ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌కు పాత విధానమే అమలు చేసి.. వచ్చే రబీ సీజన్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
ఇక రాష్ట్రంలో పంటల బీమా అమలుపై వ్యవసాయ, ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల 23వ తేదీన సచివాలయంలో సమావేశమైన ఈ మంత్రి వర్గ ఉపసంఘం.. బీమా అమలుపై చర్చించింది. వేరుశనగ తదితర పంటలకు ఖరీఫ్‌లో బీమా చేసే గడువు కూడా దగ్గరపడిన నేపథ్యంలో.. కొత్త విధానాన్ని అమలు చేసేందుకు తగిన సమయం లేదని తేల్చింది. అన్ని అంశాలనూ పరిశీలించి.. ఈ-పంటలో నమోదు చేసుకున్న వారందరికీ ఈ ఖరీఫ్‌లో ఉచిత పంటల బీమా అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అయితే రబీలో మాత్రం ఇది అమల్లో ఉండదని.. రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.