నిత్యావసరాల పెరుగుదలతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. వంటింట్లో రోజూ ఉపయోగించే కందిపప్పు, బియ్యం, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించినట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బుధవారం అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నిర్ణయాన్ని.. ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇటీవలె ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే ఒకసారి నిత్యావసరాల ధరలను తగ్గించిందని గుర్తు చేసిన మంత్రి నాదెండ్ల.. తాజాగా మరోసారి తగ్గింపు నిర్ణయం తీసుకుని నెల రోజుల్లోపే 2 శుభవార్తలు అందించినట్లు చెప్పారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.160 ఉండగా దాన్ని కేవలం రూ.150 కి మాత్రమే విక్రయించనున్నట్లు తెలిపారు. మరోవైపు.. బియ్యం కిలో ధర రూ.48 ఉండగా.. దాన్ని రూ.47 కి అమ్మనున్నట్లు పేర్కొన్నారు. స్టీమ్డ్ బియ్యం ధర రూ.49 ఉండగా.. దాన్ని రూ.48 కి తగ్గించినట్లు వివరించారు. అయితే ఈ తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచే విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఇక తగ్గింపు ధరలతో నిత్యావసరాలు అందించేందుకు.. తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెల రోజుల లోపై బియ్యం, కంది పప్పు ధరలను 2 సార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ఈనెల 11 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు బజార్లలోనూ ధరలు తగ్గించారు. ఈ క్రమంలోనే అంతకుముందు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.181 ఉండగా.. దాన్ని రైతు బజార్లలో రూ.160 కే ఇప్పటివరకు విక్రయించారు. తాజాగా దాన్ని మరింత తగ్గించి రూ.150 కే అందించనున్నారు.