నిత్యం లక్షలాదిమంది జనాలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అయితే కొందరు మాత్రం హడావిడిలో డబ్బులు, బంగారం వంటి వాటిని అక్కడే వదిలేసి బస్సును దిగిపోతుంటారు. ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు వాటిని గుర్తించి జాగ్రత్త చేస్తున్నారు.. ఉన్నతాధికారులతో కలిసి తిరిగి వాటిని పోగొట్టుకున్నవారికి ఇచ్చేసి తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ ఆర్టీసీ మహిళా కండక్టర్ నిజాయితీ చాటుకున్నారు. ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఈ నెల 4వ తేదీన తిరుపతి జిల్లా రంగంపేటకు చెందిన శివకుమార్ మదనపల్లె వెళ్లారు. అక్కడ స్థానికంగా ఓ జ్యువెలరీ షాపులో రూ.2.50లక్షలు విలువైన బంగారు గొలుసు తీసుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో.. సాయంత్రం మదనపల్లె నుంచి తిరుపతికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. ఆయన వెనుక సీటులో కూర్చున్నారు.. అయితే రంగంపేట దగ్గరకు బస్సు రాగానే.. హడావిడిలో శివకుమార్ గొలుసు ఉన్న బాక్సును తీసుకోకుండా బస్సు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఆ ఆర్టీసీ బస్సు తిరుపతిలో ప్రయాణికుల్ని దించిన తర్వాత.. మళ్లీ అక్కడి నుంచి ప్రయాణికులతో బయల్దేరి మదనపల్లెకు తిరిగి వచ్చింది. ఆర్టీసీ బస్సు దిగిన తర్వాత శివకుమార్‌కు బాక్సు మరిచిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే శివకుమార్ అప్రమత్తమై.. తిరిగి మదనపల్లెకు వచ్చి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే టూ టౌన్ సీఐ ఆదేశాలతో ఏఎస్‌ఐ రమణ ఆర్టీసీ బస్టాండులో ఆరా తీశారు. ఈ క్రమంలో బస్సు మహిళా కండక్టర్ గిరిజమ్మ బస్సులో చూడగా వెనుక సీటులో బంగారు గొలుసు ఉన్న బాక్సు ఉండటాన్ని గుర్తించారు. ఆమె నిజాయితీగా ఆ బాక్సును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. శివకుమార్ దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించి ఆయనకు గొలుసును తిరిగి అప్పగించారు. కండక్టర్ గిరిజమ్మ ఆర్టీసీ బస్సులో దొరికిన బంగారు గొలుసు ఉన్న బాక్సును నిజాయితీగా తీసుకొచ్చి ఇవ్వడంతో.. ఆమెను ఆర్టీసీ అధికారులు, పోలీసులు, బాధితుడు అభినందించారు.