Muslim Marriages: ముస్లింల పెళ్లిళ్లు, విడాకులకు సంబంధించి కీలక చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు అస్సాంలోని బీజేపీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. ముస్లింల వివాహాలు, విడాకులకు సంబంధించి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ ఓ బిల్లును తీసుకురానుంది. ఈ బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు హిమంత బిశ్వ శర్మ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఈ బిల్లుకు అస్సాం మంత్రివర్గం ఆమోద ముద్ర కల్పించింది. అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ అండ్ డివోర్స్ బిల్-2024 ఆమోదం పొందితే.. ఇక ఆ రాష్ట్రంలో జరిగే ముస్లింల పెళ్లిళ్లు, విడాకులను తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.
గురువారం నుంచి ప్రారంభం అయిన అస్సాం శాసనసభ సమావేశాల సందర్భంగా అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ అండ్ డివోర్స్ బిల్-2024 ను సభలో ప్రవేశపెట్టేందుకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ యోచిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఈ బిల్లు ప్రకారం ఇక నుంచి ముస్లింలు చేసుకునే వివాహాలు.. తీసుకునే విడాకులకు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయనున్నారు. అయితే ఇప్పటివరకు ముస్లిం వివాహాలను కాజీలు రిజిస్టర్ చేసేవారు. అయితే గతంలో మైనర్లకు జరిపించే వివాహాలను కూడా కాజీలు రిజిస్టర్ చేశారు. కొత్తగా తీసుకువస్తున్న చట్టం ప్రకారం ఇక నుంచి అలా కుదరదని సీఎం హిమంత బిశ్వ శర్మ తేల్చి చెప్పారు.
ఇక ఈ అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ అండ్ డివోర్స్ బిల్-2024 బిల్లును అస్సాం కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. దీన్ని గురువారం నుంచి మొదలైన అస్సాం అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందించాలని ఆ రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. అదే విధంగా ఇప్పటివరకు ఖాజీలు లేదా మతపెద్దలు ముస్లింల వివాహాలను రిజిస్టర్ చేసేవారని.. ఇకపై అలా కుదరదని తెలిపారు. కొత్త బిల్లు ప్రకారం ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా జరుగుతుందని సీఎం వెల్లడించారు.
కాగా ముస్లిం మతంలో అమ్మాయికి 18 ఏళ్లు నిండకపోయినా.. అబ్బాయికి 21 ఏళ్లు రాక ముందే.. ముస్లింల వివాహ నమోదును అనుమతించే నిబంధనలను ముస్లిం వివాహాల చట్టంలో కలిగి ఉంది. అయితే ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే ప్రకారం ఇకపై రాష్ట్రంలో ముస్లిం మైనర్ బాలికలు తమ వివాహాన్ని నమోదు చేసుకోలేరని సీఎం తెలిపారు. ఇంతకుముందు అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం 1935ను ఒక ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఖాజీ వ్యవస్థను పునరుద్ధరించాలని అస్సాంలోని పలు ముస్లిం సంస్థలు ముఖ్యమంత్రిని అభ్యర్థించాయి.