మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 45 శాసనసభ సీట్లు, రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్రలోని 288 స్థానాలుకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించగా… ఝార్ఖండ్‌లోని 81 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ఇక, కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప-ఎన్నిక జరగ్గా.. అక్కడ నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ బరిలో నిలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీకి దిగడం ఇదే మొదటిసారి. దీంతో ఆ స్థానంలో ఫలితంపై ఆసక్తి నెలకుంది.
జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి-మోర్చా- కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష ఎన్డీఏ భవితవ్యం తేలనుంది. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లోనూ.. మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. అయితే, పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికే అధికారం దక్కే అవకాశముందని అంచనా వేశాయి. దీంతో అక్కడ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఈసారి కొనసాగుతుందని భావిస్తున్నారు.