నాగ చైతన్య-శోభిత ధూళిపాళ వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో చెప్తా చూస్కోండి అంటూ నిన్నే ఓ ట్రైలర్ వదిలారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి. ముందుగా చెప్పినట్లుగానే ఈరోజు వారి జాతక రీత్యా, నిశ్చితార్థ ముహూర్తం రీత్యా జరిగేది ఇదే అంటూ వేణుస్వామి తన జోస్యం చెప్పారు. ముందుగా నిశ్చితార్థం జరిగిన ముహూర్తం అసలు బాలేదని తేల్చి చెప్పారు వేణుస్వామి. న్యూమరాలజీ ప్రకారం ‘888’ వచ్చేలా 8వ తారీఖు, 8వ నెల.. దానికి ఇంకొక 8 కలిపితే 24 వచ్చేలా ’08-08-24′ తేదీన నిశ్చితార్థం జరిపించారంటూ వేణుస్వామి చెప్పారు. కానీ ఈ ముహూర్తం నిశ్చితార్థానికి అసలు పనికారదంటూ చెప్పుకొచ్చారు.
2027 వరకూ వాకే.. కానీ తర్వాత మాత్రం
ఇక అనంతరం శోభిత-నాగ చైతన్యల జాతకాలను విశ్లేషించారు వేణుస్వామి. “గతంలో సమంత-చైతన్య నిశ్చితార్థం జరిగినప్పుడే వారి దాంపత్య జీవితం నిలబడదని.. విడిపోతారని నేను చెప్పాను. ఇప్పుడు కూడా శోభిత-నాగ చైతన్య నిశ్చితార్థం జరిగినప్పుడే నా జోస్యం చెబుతున్నాను. సమంతలానే శోభిత కూడా అమావాస్య రోజే పుట్టింది. కనుక శోభిత-చైతన్య పెళ్లి చేసుకుంటే వీరిద్దరి జాతకం ప్రకారం 2027 నుంచి సమస్యలు ఉండే అవకాశం ఉంది. అప్పటివరకూ ఫర్లేదు కానీ ఆ తర్వాత మాత్రం అసలు కథ మొదలవుతుంది. ఒక స్త్రీ మూలంగా ఈ భార్యభర్తల మధ్య గొడవ వస్తుంది. దీనికి ప్రధాన కారణం శోభిత-చైతన్య.. పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు.. నిశ్చితార్థ ముహూర్తం కూడా బాలేదు.” అంటూ వేణుస్వామి చెప్పారు.
శోభిత కంటే సమంతే బెటర్
ఇక జాతకం ప్రకారం సమంత-నాగ చైతన్య జంటకి 50 మార్కులు ఇస్తే.. శోభిత-చైతన్య జంటకి 10 మార్కులు కూడా ఇవ్వలేనంటూ వేణుస్వామి అన్నారు. అలానే కెరీర్ పరంగా సమంతకి 100 మార్కులు ఇవ్వొచ్చని శోభితకి మాత్రం 20 మార్కులే ఇవ్వగలనన్నారు. అయితే తాను చెప్పిన జాతకం ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నాని.. ఎవరూ విడిపోవాలని తాను ఇలా చెప్పడం లేదన్నారు. కానీ జాతక రీత్య శోభిత ధూళిపాళ-నాగ చైతన్యలకి ఎడబాటు తప్పదంటూ తేల్చిచెప్పేశారు వేణుస్వామి. ఇక గతంలో తాను చెప్పిన వాటిపై తిట్టినట్లే ఇప్పుడు కూడా ట్రోలర్స్, మీమర్స్ క్రియేటివిటీతో తనని ట్రోల్ చేసుకోవచ్చని కానీ తాను చెప్పింది జరిగి తీరుతుందన్నారు. అయినా కూడా వాళ్ల జీవితం బాగుండాలని.. ఏమైనా పరిహారాలు పెళ్లికి ముందే చేయించుకోవాలని వేణుస్వామి సూచించారు. ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన జోస్యం వైరల్ అవుతోంది. అక్కినేని అభిమానులు వేణుస్వామిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. కానీ సామ్ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.