UP: మెడికల్‌ కాలేజీలో తీవ్ర విషాదం.. 10 మంది చిన్నారులు సజీవదహనం

ఉత్తర ప్రదేశ్‌‌లో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలో అగ్ని ప్రమాదం జరిగింది.. నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పది మంది శిశువులు సజీవదహనం అయ్యారు. ఒక్కసారిగా మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రిలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే మెడికల్ కాలేజీ దగ్గరకు చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

మెడికల్ కాలేజీలో అనారోగ్య కారణాలతో బాధపడుతున్న శిశువులకు నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందిస్తారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. మెడికల్ కాలేజీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చేలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొని బయటకు పరుగులు తీశారు. అక్కడ ఉన్న గర్భిణులను వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే.. జిల్లా యంత్రాంగమంతా ఆసుపత్రికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తోంది. మంటలు, పొగ పీల్చడంతో కొంతమంది చిన్నారుల అస్వస్థతకు గురయ్యారు.. వారికి వైద్యం అందిస్తున్నారు.

మరోవైపు ఝాన్సీలో జరిగి ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాదంలో గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని.. ఎలా జరిగిందో విచారణ చేయాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేశ్‌ పాఠక్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి కూడా వెంటనే ఝాన్సీకి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

About amaravatinews

Check Also

CBSE బోర్డు కొత్త రూల్స్.. 10, 12 తరగతి పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *