బిహార్‌లోని ఓ ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుని.. ఏడుగురు భక్తులు మృతిచెందారు. ఆదివారం అర్ధరాత్రి జెహానాబాద్ పట్టణం మఖ్దుంపూర్‌లోని బర్వావర్ కొండపై ఉన్న బాబా సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడినవారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శ్రావణ మాసంలోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున జరిగే పూజల కోసం ఆదివారం రాత్రి నుంచే భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తోపులాటకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తొక్కిసలాట ఘటన గురించి జెహనాబాద్ ఇన్‌స్పెక్టర్ దివాకర్ కుమార్ విశ్వకర్మ మాట్లాడుతూ.. ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్టు ధ్రువీకరించారు. వాటిని పోస్ట్‌మార్టం కోసం తరలించామని చెప్పారు. అయితే, తొక్కిసలాటకు దారితీసిన కారణాలేంటని ఆయన వెల్లడించారు. భద్రత లోపమా? లేకుంటే మరే కారణమైనా ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు.
బాధితుల కుటుంబాల రోదనలు, గాయపడినవారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. క్షతగాత్రులకు స్థానిక మఖ్దుంపూర్, సదర్ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ‘మృతదేహం కోసం మూడు గంటల నుంచి ఎదురు చూస్తున్నాం. ఆలయం వద్ద తొక్కిసలాట జరిగిందని, రద్దీని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు చెబుతున్నారు. కొంతమంది వాలంటీర్లు భక్తులపై లాఠీలు ఝళిపించడం తొక్కిసలాటకు దారితీసింది.’ అని ఓ బాధితుడి బంధువు ఆరోపించారు.