Pension Scheme: అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ అటల్ పెన్షన్ యోజన. వీరికి కూడా 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ అందుతుంది. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 3 సామాజిక భద్రతా పథకాల్ని తీసుకురాగా.. అందులోనే ఒకటి అటల్ పెన్షన్ స్కీమ్. ఇందులో చేరిన వారు ప్రతి నెలా కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ పోతే.. రిటైర్మెంట్ తర్వాత వారి పెట్టుబడులకు అనుగుణంగా ఎంత పెన్షన్ వస్తుందనేది నిర్ణయిస్తారు. కోట్ల మందికిపైగా ఈ స్కీమ్‌లో చేరారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తులు ఈ స్కీంలో చేరొచ్చు. ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు ఎవరైనా తప్పనిసరిగా పోస్టాఫీస్ లేదా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులో గానీ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి.
బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. 40 ఏళ్ల లోపు మాత్రమే చేరాలి. తర్వాత అవకాశం ఉండదు. ఇంకా నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చేవారు ఈ పథకానికి అనర్హులు. టాక్స్ చెల్లించేవారికి కూడా అర్హత లేదు. దీంట్లో పెట్టుబడులు వయసును బట్టి మారుతుంటుంది. చేరిన సమయాన్ని బట్టి.. పెట్టుబడుల్ని బట్టి.. కనీసం రూ. 1000 నుంచి 5 వేల వరకు పెన్షన్ వస్తుంది.
ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో చేరినట్లయితే. రిటైర్మెంట్ వరకు అంటే మరో 42 ఏళ్లు కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈ వయసులో చేరే వారు కనీసం నెలకు రూ. 42 నుంచి గరిష్టంగా రూ. 210 చొప్పున చెల్లించొచ్చు. ఇదే సమయంలో 40 సంవత్సరాలకు చేరితే మాత్రం కనీసం రూ. 291 నుంచి గరిష్టంగా రూ. 1454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కాంట్రిబ్యూషన్లను బట్టి నెలకు రూ. 1000, 2 వేలు, 3 వేలు, 4 వేలు, 5 వేలు ఇలా పెన్షన్ అందుతుంది.