గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎవ్వరినీ లెక్క చేయకుండా బుల్డోజర్లు పంపిస్తున్నారు. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక ఇప్పటికే కొందరు అక్రమ నిర్మాణదారులకు హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. మాదాపూర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్లు నిర్మించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సైతం హైడ్రా అధికారులు నోటీసులు పంపారు.
ఇక ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సైతం హైడ్రా నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాతో పాటు పలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ జగన్ లోటస్ పాండ్ ఇంటికి నోటీసులు పంపినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రేపో మాపో జగన్ ఇంటిని కూడా హైడ్రా అధికారులు కూల్చేయనున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తాజాగా స్పందించారు. జగన్ ఇంటికి నోటీసుల ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారం నిజం కాన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాము ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు.