Auto Stocks Fall: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు.. పశ్చిమాసియా దేశాల్లో రాజకీయ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా.. షేర్లను అమ్మేస్తున్నారు. దీంతో గత కొన్ని సెషన్లుగా తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇవాళ ఆరంభంలో కాస్త మెరుగ్గానే ఉన్న సూచీలు.. ఆఖర్లో భారీగా పడిపోయాయి. చివరకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు పడిపోయి 81 వేల మార్కు వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ మరోవైపు 220 పాయింట్ల పతనంతో 24 వేల 750 వద్ద సెషన్ ముగించింది. మార్కెట్లలో హెవీ వెయిట్ షేర్లు పతనం అవుతుండటంతో సూచీలు నష్టపోతున్నాయి. అయితే ఇవాళ ఐటీ రంగం రాణించడం మాత్రం కాస్త ఊరట కలిగించే అంశం.
స్టాక్ మార్కెట్లో ఇవాళ ఆటో సెక్టార్ దారుణంగా పడిపోయింది. గత కొంత కాలంగా సేల్స్ పడిపోవడంతో.. ఇంకా పండగ సీజన్‌లోనే బలహీన డిమాండ్ ఉంటుందన్న అంచనాలతో ఈ రంగం స్టాక్స్ కుప్పకూలిపోయాయి. టూ- వీలర్, 3- వీలర్ మానుఫ్యాక్చరర్ అయిన ప్రముఖ సంస్థ బజాజ్ ఆటో.. స్టాక్ అక్టోబర్ 17 సెషన్లో భారీగా నష్టపోయింది. పండగ సీజన్లో వృద్ధి అంచనాల్ని తగ్గించింది. ఈ కారణంతోనే ఇంట్రాడేలో ఆటో ఇండెక్స్ 3.5 శాతం పతనమైంది.
బజాజ్ ఆటో స్టాక్ ఇంట్రాడేలో ఏకంగా 13 శాతానికిపైగా పడిపోయింది. ఒక్కరోజే షేరుపై రూ. 1500కుపైగా పడిపోవడం చూస్తేనే పతనం అర్థం చేసుకోవచ్చు. చివరకు 13.11 శాతం నష్టపోయి.. రూ. 10,093.50 వద్ద సెషన్ ముగించింది. కిందటి సెషన్లో రూ. 11,616.95 వద్ద సెషన్ ముగించగా.. ఇవాళ చివరకు రూ. 10 వేల స్థాయిలో స్థిరపడింది. త్వరలోనే రూ. 10 వేల మార్కు కోల్పోయి ప్రమాదం కూడా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ కూడా భారీగా పడిపోయి రూ. 2.83 లక్షల కోట్లకు దిగొచ్చింది.
బజాజ్ ఆటో ప్రకటనతోనే.. ఇతర ఆటో స్టాక్స్ కూడా పెద్ద మొత్తంలో నష్టపోయాయి. మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ స్టాక్ 2.23 శాతం నష్టంతో రూ. 12,108 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్ షేరు 1.45 శాతం తగ్గి రూ. 894.30 వద్ద సెషన్ ముగించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ షేరు కూడా 3.43 శాతం పడిపోయింది. హీరో మోటోకార్ప్ స్టాక్ 3 శాతానికిపైగా తగ్గింది. ఐచర్ మోటార్స్ స్టాక్ ఒక శాతం పతనమైంది. బజాజ్ ఆటో కంపెనీ బుధవారం రోజు సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించింది. నికర లాభం ఏకంగా 31 శాతం పడిపోయి.. రూ. 1385 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఆదాయం రూ. 13,247 కోట్లుగా వచ్చింది.