సొంతగడ్డపై పాకిస్థాన్‌కు ఘోర పరాభవం.. రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్ విజయం..

సొంతగడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఆ జట్టు టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. పూర్తిస్థాయి జట్టులో బరిలోకి దిగినప్పటికీ.. బంగ్లాదేశ్‌ను కట్టడి చేయలేక చిత్తుగా ఓడిపోయింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓడి.. ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. రెండో టెస్టులో పట్టు చిక్కే అవకాశం లభించినప్పటికీ.. 6 వికెట్ల తేడాతో పరాజయం పాలై పరువు పోగొట్టుకుంది.

రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పాకిస్థాన్‌పై టెస్టుల్లో బంగ్లాదేశ్‌ తొలిసారి టెస్టు సిరీస్‌ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 274 పరుగులకు కుప్పకూలింది. బాబర్‌ ఆజమ్, మహమ్మద్‌ రిజ్వాన్, షాన్‌ మసూద్‌ లాంటి ప్లేయర్లు ఉన్నా.. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ లాంటి చిన్నజట్టుపై కనీసం 300 పరుగులు కూడా చేయలేకపోయింది. అనంతరం బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌట్‌ అయింది.

బంగ్లాదేశ్ జట్టు ఓ దశలో 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. లిట్టన్ దాస్ (138), మెహదీ హసన్ మిరాజ్ (78) అద్భుత పోరాటంతో కోలుకున్న బంగ్లాదేశ్ 262 పరుగులు చేయగలిగింది.

రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఆతిథ్య జట్టు కేవలం 172 పరుగులకు ఆలౌట్‌ అయింది. బంగ్లా యువ పేసర్ల దెబ్బకు పాక్ బ్యాటర్ చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 12 రన్స్‌తో కలిపి బంగ్లాదేశ్‌ ముందు 185 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. తొలి టెస్టులో విజయం సాధించిన బంగ్లాదేశ్‌.. 185 పరుగుల లక్ష్య ఛేదనలో రాణించింది. నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి.. చరిత్ర సృష్టించింది.

కాగా పాకిస్థాన్ క్రికెట్‌ జట్టు స్వదేశంలో ఆడిన చివరి 10 టెస్టుల్లో ఒక్క దాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. పాకిస్థాన్ జట్టు చివరిసారిగా 2021 ఫిబ్రవరిలో సొంత గడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేకపోయింది. 2022 మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో 0-1 తేడాతో పాక్‌ ఓడిపోయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 0-0తో డ్రాగా ముగించింది. తాజాగా బంగ్లాదేశ్‌తో 0-2తో చిత్తుగా ఓడిపోయింది. దీంతో పాక్ ఆటగాళ్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

About amaravatinews

Check Also

బుమ్రాను పొగుడుతూనే సిరాజ్ గాలి తీసిన ఆసీస్ స్పీడ్ స్టార్..

జస్ప్రీత్ బుమ్రా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో భారత విజయాలకు ప్రధాన స్తంభంగా నిలిచాడు. బ్రెట్ లీ అతని ప్రతిభను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *