బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవదహనం.. 440కి చేరిన మృతులు

బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు ఆగడం లేదు. ఇప్పటికే ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి పారిపోయినా అక్కడ ఆందోళనలు మాత్రం చల్లారడం లేదు. దేశం మొత్తాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నా.. నిరసనకారులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య 440 కి పెరిగింది. తాజాగా ఓ హోటల్‌కు అల్లరిమూకలు నిప్పుపెట్టడంతో.. అందులో ఉన్న 24 మంది సజీవ దహనం అయ్యారు. ఆ హోటల్‌లో ఇండోనేషియాకు చెందిన ఓ పౌరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి చెందిన ఆఫీస్‌లు, నేతల ఇళ్లు, ఆస్తులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా జషోర్‌ జిల్లాలోని జబీర్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌కు అల్లరిమూకలు నిప్పు పెట్టాయి. అయితే ఆ హోటల్ అవామీ లీగ్‌ ప్రధాన కార్యదర్శి షాహిన్‌ చక్లాదర్‌కు చెందింది కావడం గమనార్హం. ఆ హోటల్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. దాన్ని ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బందిని కూడా అడ్డుకున్నారు. దీంతో ఆ హోటల్ కాలి బూడిదైంది. ఈ ఘోర దుర్ఘటనలో 24 మంది సజీవ దహనమైనట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే చనిపోయిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. బంగ్లాదేశ్ నిరసనల్లో చనిపోయిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

దాదాపు గత 21 రోజులుగా బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళనల కారణంగా వందలాది మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 440కి చేరుకుంది. ఇక దేశంలో హింసను అదుపులోకి తెచ్చి శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు బంగ్లాదేశ్ సైన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి భారత్‌కు ఆశ్రయం కోసం వెళ్లిన కొన్ని గంటల్లోనే ఆ దేశంలో విధ్వంసం మరింత తీవ్ర అయింది. గంటల వ్యవధిలోనే 100 మందికి పైగా చనిపోయినట్లు స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది.

అయితే ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్నా.. మరణాలు పెరుగుతున్నా.. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆందోళనల కారణంగా గత కొన్ని రోజులుగా మూసివేసిన విద్యాసంస్థలు కొన్ని చోట్ల తెరుచుకుంటున్నాయి. దుకాణాలు, ఆఫీస్‌లు, బిజినెస్‌లు క్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

About amaravatinews

Check Also

Donald Trump: తులసి గబ్బర్డ్‌కు ట్రంప్ కీలక పదవి.. హిందువే గానీ భారతీయురాలు కాదు, అసలు ఆమె ఎవరు?

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. తన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *