Bank FD: రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి కోరుకునే వారికి బ్యాంక్ డిపాజిట్లు సరైన ఎంపికగా చెబుతుంటారు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు ఫిక్స్‌డ్ డిపాజిట్ (Bank Deposits) పథకాలు కల్పిస్తాయి. పోస్టాఫీసులోనూ ప్రస్తుతం మంచి వడ్డీ రేట్లు ఉన్నాయి. అందుకే ఇటీవలి కాలంలో చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వివిధ టెన్యూర్లను బట్టి వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి బ్యాంకులు. ప్రస్తుతం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయి. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కనిపించే లాభాలే కాదు.. కనిపించని నష్టాలు సైతం ఉంటాయని డిపాజిటర్లు తెలుసుకోవాలి. బ్యాంకులో డబ్బులు జమ చేసే ముందే ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది.
ఒకసారి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన తర్వాత మెచ్యూరిటీ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మధ్యలో మనకు డబ్బులు అసరమైనప్పుడు తీసుకోవడం చాలా బ్యాంకులు అనుమతించవు. అయితే, కొన్ని బ్యాంకులు ప్రీమెచ్యూరిటీ చేసేందుకు అనుమతిస్తాయి. అయితే పెనాల్టీలు విధిస్తాయి. వడ్డీ రేట్లలో కోత పెడతాయి. సాధారణంగా ఈ పెనాలీ 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటుంది. దీంతో నష్టపోవాల్సి వస్తుంది. అలాగే ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల టెన్యూర్ 5 ఏళ్లు ఉంటుంది. ఇందులో ఒకసారి డబ్బులేస్తే 5 ఏళ్ల వరకు తీసుకునేందుకు అవకాశం ఉండదని గమనించాలి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసి దానిపై వడ్డీ ఆదాయం పొందుతున్నప్పుడు దానిపై ప్రభుత్వం ట్యాక్స్ విధిస్తుంది. ఆదాయపు పన్ను రిటర్నుల్లో మీ డిపాజిట్లపై రాబడిని పేర్కొనాలి. అయితే, ట్యాక్స్ పరిధిలోకి వచ్చేందుకు కొంత లిమిట్ ఉంది. సాధారణ ప్రజలకు అయితే వడ్డీ ఆదాయం రూ.40వేలు దాటితే పన్ను పడుతుంది. సీనియర్ సిటిజన్లకు ఇది రూ.50 వేలుగా ఉంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 6-8 శాతం మధ్య ఉంటున్నాయి. కొన్ని బ్యాంకులు 9 శాతానికిపైగా ఆఫర్ చేస్తున్నాయి. అయితే, మీకు చెప్పిన వడ్డీ రేటులో ఆదాయం లెక్కిస్తే తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ప్రాసెసింగ్ ఫీ వంటి ఇతర రుసుములను పరిగణనలోకి తీసుకుంటే వడ్డీ రేటు మీకు 1 శాతం వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇలా కూడా తెలియకుండా నష్టపోవచ్చు.
బ్యాంకుల్లో డబ్బులు వేస్తే సురక్షితమని అంతా భావిస్తారు. అయితే, అది 100 శాతం నిజం కాదనే చెప్పాలి. బ్యాంకు దివాలా తీయడం, ప్రకృతి విపత్తులు, ఇతర కారణాల వల్ల బ్యాంకు దివాలా తీస్తే నష్టపోవచ్చు. అయితే. డిపాజిటర్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే మీరు నష్టపోవాల్సి వస్తుంది. ఈ లిమిట్ దాటకుండా చూసుకోవడం మంచిది.