Bar And Restaurants: కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాల సమయాన్ని మరికొన్ని గంటలు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మందుబాబులకు శుభవార్త చెప్పింది. బడ్జెట్ రెవెన్యూ లోటును భర్తీ చేసుకునేందుకు.. మద్యం విక్రయాలు పెంచాలని సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విక్రయాల సమయాన్ని పెంచడంతో.. అమ్మకాలు పెరిగి.. ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించుకునేందుకు వ్యాపారులకు అనుమతులు ఇచ్చేసింది. ఈ మేరకు తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బెంగళూరులో మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగిస్తూ.. సిద్ధరామయ్య ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. నగరంలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం అందుబాటులో ఉండేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం.. రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి బీర్ల అమ్మకాలపై వసూలు చేస్తున్న ఎక్సైజ్ ట్యాక్స్‌ను అదనంగా 10 శాతం పెంచింది. బీర్లపై ఎక్సైజ్ ట్యాక్స్ పెంచుతూ చేసిన ప్రతిపాదనలకు.. గతంలోనే కర్ణాటక వార్షిక బడ్జెట్‌లో సిద్ధరామయ్య సర్కార్ చేర్చింది. ఈ నిర్ణయం వల్ల ఏటా కర్ణాటక ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ.1,200 కోట్ల ఆదాయం సమకూరుతోంది.
కర్ణాటకలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా ఉంటోంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2022-2023 ఆర్థిక సంవత్సరంలో.. కేవలం బీర్ల అమ్మకాల ద్వారా మాత్రమే రూ.800 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 390.66 లక్షల కార్టన్ బాక్సుల మేర బీర్లు అమ్ముడు పోయాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2021-2022 తో పోల్చుకుంటే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 268.83 లక్షల కార్టన్ బాక్సుల మేర బీర్ల అమ్ముడు పోయాయి. ఇప్పుడు తాజాగా బీర్ల అమ్మకాలపై ఎక్సైజ్ ట్యాక్స్‌ను 10 శాతం పెంచడం సిద్ధరామయ్య సర్కార్‌కు మరింత ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది.