Post Office: గత కొంతకాలంగా దేశంలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ.. చాలా మంది నార్కొటిక్ అధికారులు, పోలీసులకు చిక్కుతున్నారు. రూ.వేల కోట్ల విలువైన కిలోల కొద్ది డ్రగ్స్.. దొరుకుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్రగ్స్ కట్టడి చేసేందుకు అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. వాటి సరఫరా మాత్రం ఆగడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌ను పోర్టుల వద్ద, ఎయిర్‌పోర్టుల వద్ద పట్టుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరాదారులు రూటు మార్చారు. పోస్టాఫీస్‌ల ద్వారా డ్రగ్స్ పార్శిళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విదేశాల నుంచి వచ్చిన పార్శిళ్ల ద్వారా సరఫరా చేస్తున్న డ్రగ్స్ భారీగా పట్టుబడింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా పోస్టాఫీస్‌కు వచ్చిన పార్శిళ్లలో భారీగా మాదక ద్రవ్యాలు దొరకడం సంచలనం రేపుతోంది. వివిధ దేశాల నుంచి చామరాజపేట ఫారిన్ పోస్టాఫీస్‌కు వచ్చిన వందలాది పార్శిళ్లు గత కొంతకాలంగా అలాగే ఉన్నాయి. డెలివరీ కాని పార్శిళ్లను పోస్టాఫీస్ సిబ్బంది అలాగే ఉంచారు. అయితే విదేశాల నుంచి వచ్చే పార్శిళ్లపై ప్రత్యేక దృష్టిసారించిన సీసీబీ నార్కొటిక్ విభాగం అధికారులకు.. చామరాజపేట ఫారిన్ పోస్టాఫీస్‌లో ఉన్న పార్శిళ్ల సంగతి తెలియడంతో అక్కడికి వెళ్లి తనిఖీలు చేయగా.. విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.