మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే, రూ.లక్షన్నర కోట్లతో చేపడుతోన్న మూసీ ప్రాజెక్ట్ దేశంలో అతిపెద్ద కుంభకోణం అంటూ ఉట్నూర్‌లో జరిగిన ఓ సభలో కేటీఆర్ ప్రస్తావించారు. దేశంలో రాబోయే ఎన్నికలకు కావలసిన నిధుల కోసం కాంగ్రెస్ మూసీ ప్రాజెక్టును వాడుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. అప్పుడు కేటీఆర్ చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దీంతో గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఉట్నూరు పోలీసులు కేటీఆర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కేటీఆర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.