బిగ్ బాస్ సెలబ్రిటీ నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేతృత్వంలో నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నూతన్ నాయుడికి కండువా కప్పి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ ద్వారా నూతన్ నాయుడు ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. అయితే ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో షర్మిల సమక్షంలో హస్తం పార్టీలోకి నూతన్ నాయుడు చేరారు. నూతన నాయుడు సినిమాల్లో నటించడంతో పాటుగా నిర్మాతగానూ వ్యవహరించారు. అయితే బిగ్ బాస్ సీజన్ ద్వారా.. తెలుగు ప్రేక్షకులకు నూతన్ నాయుడు బాగా పరిచయమయ్యారు. అయితే నూతన్ నాయుడు ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీలోనూ పనిచేశారు. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరుఫున పనిచేశారు.
బిగ్ బాస్ సీజన్ తర్వాత తన ఇంట్లో పనిచేసే దళిత యువకుడికి శిరోముండనం చేయించినట్లు నూతన్ నాయుడిపై ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యి కొన్ని రోజులు జైళ్లో ఉన్నారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత గత కొంతకాలంగా వార్తల్లో లేని నూతన్ నాయుడు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి వార్తల్లో నిలిచారు.