Tirumala Declaration: తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగు వారికి కొంగు బంగారమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ప్రసాదంపై చెలరేగిన వివాదం ఏపీతో పాటు తెలంగాణలో కూడా అగ్గి రాజేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ లడ్డూ వివాదంపై తాజాగా.. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ స్పందించారు. మంగళవారం (అక్టోబర్ 01న) రోజున ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. తిరుమలకు వెళ్తానని చెప్పి.. పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే తిరుమల వెళ్లలేదా అని లక్ష్మణ్ నిలదీశారు. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా అని.. తన మతం ఏంటో చెప్పారని పేర్కొన్నారు.
గతంలో.. రాష్ట్రపతి హోదాలో తిరుమలకు వచ్చిన అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) కూడా డిక్లరేషన్ ఇచ్చారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. వైఎస్ జగన్.. అబ్దుల్ కలాం కంటే గొప్పనా అని ప్రశ్నించారు. ఎవరి విశ్వాసాలు వారివని.. కానీ ఇతరుల నమ్మకాలను కూడా గౌరవించాలని లక్ష్మణ్ సూచించారు.
అయితే.. ఈ తిరుమల లడ్డూ వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టించగా.. ఇది కాస్త సుప్రీంకోర్టు వరకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీం.. కీలక వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారం అని.. అలాంటి సున్నితమైన అంశంపై ఏపీ సీఎం తీవ్రమైన ఆరోపణలు చేయటం సరికాదని కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న దానికి ఆధారాలు ఏంటని ప్రశ్నించింది. కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సర్వోన్నత ధర్మాసనం వ్యాఖ్యానించింది.