కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లిలో ఉదయం అంతా ఉత్సాహంగా సందడిగా ఉన్న వధువు.. రాత్రి శోభనం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో నవవధువు ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షితకు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన వరుడు నాగేంద్రతో ఆగస్టు నాలుగో తేదీన సోమవారం ఉదయం వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా హర్షిత, నాగేంద్ర వివాహంతో కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాల మధ్య ఉన్న క్షణాలు.. పెళ్లిరోజు రాత్రికే ఆవిరి అయిపోయాయి.. ఉదయం వివాహం.. రాత్రికి నవవధువు హర్షిత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
నాగేంద్రతో హర్షితకు ఉదయం అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.. నూతన దంపతులకు సోమందేపల్లిలో రాత్రి ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే.. వరుడు నాగేంద్ర స్వీట్లు తీసుకునేందుకు బయటకు వెళ్ళాడు.. ఇటు పెళ్లి ఇంట్లో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. హర్షిత శోభనం గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.. అప్పటివరకు కళ్ల ముందు కనిపించిన నవవధువు హర్షిత.. ఒక్కసారిగా వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అయ్యారు. ఎంతసేపటికి యువతి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు పగలగొట్టి.. పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లు నిర్ధారించారు.
పెళ్లి ఇంట్లో.. పచ్చని తోరణాల మధ్య.. పారాణి కూడా ఆరకముందే నవ వధువు ఆత్మహత్య చేసుకుందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పోలీసులు నవవధువు హర్షిత ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు.. నవ వధువు హర్షిత ఆత్మహత్య చేసుకోవడంతో.. వరుడు నాగేంద్ర, కుటుంబ సభ్యులు పెళ్లి ఇంట్లోంచి వెళ్లిపోయారు.. నవవధువు హర్షిత ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal