KCR on Demolitions: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు.. మూసీ ప్రక్షాళన విషయం అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, తీవ్ర ఆరోపణలు నడుస్తున్న క్రమంలోనే.. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు (నవంబర్ 08న) సందర్భంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేయటమే కాకుండా.. అదే సందర్భంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఘాటైనా వ్యాఖ్యలు చేయటం రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు.
ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొనగా.. కేసీఆర్ సమక్షంలో సినిమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, నటుడు రవితేజ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్లకు కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో మాట్లాడిన కేసీఆర్.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, హైడ్రా కూల్చివేతలు, బీఆర్ఎస్ నేతల అరెస్టులపై ఘాటుగా స్పందించారు.