బాబు చిట్టీ.. అక్కడ మార్కులు పడ్డాయిగా.. ఇక ఇక్కడ దృష్టి పెట్టు.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రైతు రుణమాఫీ, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ఇటీవల రాజీవ్ గాంధీ విగ్రహం ఇలా పలు అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శల పర్వం నడుస్తోంది. కాగా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఒకే నెలలో ఏకంగా 48 మంది శిశువులు, 14 మంది బాలింతలు ప్రాణాలు వదిలినట్టు ఉన్న రిపోర్టులపై వాడీ వేడిగా చర్చ నడుస్తోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్.. తప్పుడు లెక్కలు చెప్తోందని.. అసలు మరణాల సంఖ్యను దాచిపెడుతోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కాగా.. ప్రభుత్వ పెద్దలు మాత్రం.. ఇదంతా సర్వసాధారణమేనని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇలాగే జరిగిందని.. కానీ ఇప్పుడే ఇలా జరుగుతుందన్నట్టుగా ప్రతిపక్షం గగ్గోలు పెడుతుందంటూ స్వయంగా వైద్యారోగ్య శాఖ మంత్రే ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. “బాబు చిట్టీ.. రాహుల్ గాంధీ బొమ్మకు ఢిల్లీలో మార్కులు పడ్డాయిగా.. ఇక గాంధీ హాస్పిటల్‌లో చనిపోతున్న పిల్లలు, ఆడబిడ్డల మీద దృష్టి పెట్టు..” అంటూ ట్విట్టర్ వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు కేటీఆర్.

అయితే.. ఇదే విషయంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందిస్తూ.. ట్విట్టర్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రులను నాశనం చేసే కుట్రలు ఇకనైన బంద్ చేస్తే మంచినదని కేటీఆర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహా హెచ్చరించారు. గాంధీ ఆస్పత్రిపై బురద జల్లి, వైద్యం కోసం వచ్చే నిరుపేదల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ఏ టెర్షియరీ కేర్ హాట్పిటల్‌లోనైనా.. ప్రతి నెల పదుల సంఖ్యలో మరణాలు జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మరణాలు జరుగుతున్నాయంటూ కేటీఆర్.. నెంబర్లను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాడంటూ దుయ్యబట్టారు.

దీనిపై కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైద్యం అంద‌టం లేదు.. పసి పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మ‌హాప్రభో అంటే బుద‌రజ‌ల్లుతున్నారు అని మాట్లాడ‌తారా? అంటూ నిలదీశారు. “మీరు ఆరోపించిన‌ట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ముకాయాల‌నుకుంటే.. హైద‌రాబాద్ న‌గ‌రం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్దాసుప‌త్రులు, వ‌రంగ‌‌ల్‌లో న‌డుస్తున్న అతిపెద్ద ఆసుప‌త్రి, బ‌స్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేసే వాళ్లమా? కేసీఆర్ కిట్లు, త‌ల్లి-బిడ్డను ఇంటి ద‌గ్గర దిగ‌బెట్టేలా వాహ‌నాలు, సాదార‌ణ ప్రస‌వాలు జ‌రిగేలా చ‌ర్యలు తీసుకోవ‌టం, రెండు ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీలు ఉన్న చోట 33 మెడిక‌ల్ కాలేజీల ఏర్పాట్లు జ‌రిగేవా..?” అంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు.

About amaravatinews

Check Also

ఫార్ములా-E రేస్‌ కేసు విచారణలో ఉత్కంఠ.. BLN రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టిన ఏసీబీ

ఫార్ములా ఈ రేస్ కేసులో ఎంక్వైరీ టాప్ గేర్‌లో నడుస్తోంది. ఓ వైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ వేగం పెంచాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *