అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (62) తన వారసత్వ ప్రణాళికలను వెల్లడించారు. ఈ క్రమంలో తాను ఎప్పుడు పదవీ విరమణ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసు ఉన్న గౌతమ్ అదానీ.. తన 70వ ఏటా బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, సిమెంట్, పునరుత్పాదక ఇంధన, గ్యాస్ వంటి విభిన్న రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ గ్రూప్ అదానీ నేతృత్వంలో కొనసాగుతుండగా.. ఆయన పదవీ విరమణ తర్వాత ఎవరి చేతుల్లోకి వెళ్లనుంది?
2030లో తాను బాధ్యతల నుంచి వైదొలుగనున్నట్లు ప్రకటించిన గౌతమ్ అదానీ.. తన కుమారులకు వ్యాపారాలను అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. బాధ్యతల బదిలీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సాఫీగా జరగేలా చూడాలని రెండో తరానికి సూచించినట్లు పేర్కొన్నారు. గౌతమ్ అదానీ పదవీ విరమణ తర్వాత ఆయన కుమారు కరణ్ అదానీ, జీత్ అదానీ, సోదరుడి కుమారు ప్రణవ్ అదానీ, సాగర్ అదానీలకు అదానీ గ్రూప్‌లో సమాన వాటా లభిస్తుందని బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది. ప్రస్తుతం అదానీ పోర్ట్స్ ఎండీగా కరణ్ అదానీ కొనసాగుతున్నారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా చిన్న కుమారుడు జీత్ అదానీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్‌గా ప్రణవ్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సాగర్ అదానీ ఉన్నారు.
ప్రస్తుతం ఆదనీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 213 బిలియన్ డాలర్లుగా అంచనా. 10 నమోది కంపెనీలు ఈ గ్రూప్లో ఉన్నాయి. ఇన్‌ఫ్రా, షిప్పింగ్, పోర్ట్స్, సిమెంట్, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ పోర్ట్స్, మీడియా సహా పలు రంగాల్లో అదానీ గ్రూప్ విస్తరించి ఉంది. తన తర్వాత వ్యాపారాలను కలిసి నిర్వహిస్తారా? లేదా వేరు వేరుగా ఉంటారా? అని తమ వారసులను ప్రశ్నించగా వారు కలిసికట్టుగానే ముందుకు వెళ్తామని సమాధానమిచ్చారని బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు గౌతమ్ అదానీ. ‘ వాపార స్థిరత్వానికి వారసత్వం కీలకంగా మారుతుంది. నా తర్వాత వచ్చిన వారుసులు నిబద్ధతతో పని చేస్తున్నారు. వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు తర్వాతి తరం బాధ్యతలు తీసుకోవాలి. అయితే, ఈ అంశంపై ఉమ్మడి నిర్ణయానికే ప్రాధాన్యం ఇస్తాం.’ అని పేర్కొన్నారు.