SSC GD Constable Recruitment 2025 : ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పురుషులు, మహిళలు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. పురుషులకు 35,612 పోస్టులు ఉండగా.. మహిళలకు 3869 పోస్టులున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు.. అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)లో సిపాయి పోస్టుల భర్తీకి Staff Selection Commission ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహిస్తోంది.
ఈ పోస్టులకు 10వ తరగతి (10th Class) విద్యార్హత ఉన్న అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. అక్టోబర్ 14వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ పరీక్ష వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా.. తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అభ్యర్థులు అప్లయ్ చేసుకోవడానికి, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి https://ssc.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
Amaravati News Navyandhra First Digital News Portal