ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా కేబినెట్ ర్యాంక్‌తో కీలక పదవి దక్కింది. ఆయన్ను విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.. రెండేళ్ల పాటు ఈ పదవిలొ కొనసాగుతారు. అయితే చాగంటి ఈ పదవిని తీసుకుంటారా లేదా అనే చర్చ జరిగింది. ఎందుకంటే 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం, 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరోసారి పదవులు ఇచ్చినా ఆయన తిరస్కరించారు. తనకు ఈ పదవి దక్కడంపై చాగంటి కోటేశ్వరరావు స్పందించారు. కానీ ఈసారి మాత్రం ఆ పదవిని తీసుకుంటానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే ముఖ్యమైన బాధ్యతను తనకు అప్పగిస్తూ సలహాదారుగా నియమించడాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు చాగంటి కోటేశ్వరరావు. తాను అంగీకారం తెలపడం పదవుల కోసం కాదని.. తనకు ఇప్పుడు ఏ గౌరవం తక్కువ కాలేదన్నారు. తన వయసు 65 ఏళ్లని గుర్తు చేశారు.. ఆరోగ్యకరంగా ఏమైనా చెయ్యగలిగేది మరో ఐదారేళ్లు మాత్రమే అన్నారు. ఈలోగా తాను అన్నివేల మంది పిల్లలను కూర్చోబెట్టలేను అన్నారు. ప్రభుత్వపరంగా వాళ్లు కూర్చోబెడితే తాను నాలుగు మంచిమాటలు చెప్పగలను అన్నారు. అందుకే తాను ఈ పదవి తీసుకోవడానికి ఒప్పుకున్నట్లు చెప్పారు. తాను చెప్పే మాటలతో పిల్లలకు మేలు జరిగితే అంతకన్నా సంతోషం ఏముంటుంది అన్నారు. అందుకే తనకు ప్రభుత్వం అప్పగించిన ఈ కర్తవ్యాన్ని ఎంతో సంతోషంగా అంగీకరించానని తెలిపారు. ఆ ఒక్క కారణంతోనే ఈ పదవిని తీసుకోవాలని నిర్ణయించానన్నారు.