తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ఇది నింజగా బ్యాడ్‌న్యూసే. జనవరి నుంచి రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ హాస్టల్స్, అంగన్‌నాడీ కేంద్రాలకు మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా.. జనవరి నుంచి లబ్దిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డులు ఉన్న ప్రతి లబ్దిదారుడికి కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి 6 కేజీల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సన్న బియ్యం పంపిణీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి నుంచి తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా.. 3 నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని అధికారులు తెలిపారు. అన్నం పొల్లు పొల్లు కాకుండా ముద్దగా మారుతుందని అన్నారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆ తర్వాతే అన్నం తినటానికి అనుకూలంగా ఉంటుందన్నారు. దీంతో సంక్రాంతి నుంచి అనుకున్న సన్న బియ్యం.. ఉగాది నుంచి అమలయ్యే ఛాన్స్ ఉంది.