Election Commission: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై సుదీర్ఘ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులు కావడంతోపాటు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించగా.. వాటిపైనా సీఈసీ స్పందించారు.
ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ అవి భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతోందని వెల్లడించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ విషయంలో మీడియా సహా అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని తెలిపారు. ఇక ఎగ్జిట్‌పోల్స్‌తో ఎన్నికల సంఘానికి ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌కు శాంపిల్ సైజ్ ఏంటి.. సర్వేలు ఎక్కడ నిర్వహించారు.. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే బాధ్యత ఎవరిదీ అని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆలోచించుకోవాలని పేర్కొంది. ఈ ఎగ్జిట్‌పోల్స్ విషయంలో మీడియాకు కూడా స్వీయ నియంత్రణ అవసరమని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.