పవన్ కళ్యాణ్ ఆలోచన బాగుంది.. చిలుకూరు ప్రధానార్చకులు రంగరాజన్

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. తాజాగా ఈ వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ కూడా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం దారుణమని.. ఇది భయంకరమైన, నమ్మలేని నిజం అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి నెయ్యి కోసం టెండరింగ్ ప్రక్రియ చేపట్టడాన్ని తప్పుబట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యక్ష వైకుంఠ క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని.. ఈ కల్తీ విషయంలో నిజానిజాలపై విచారణ చేపట్టాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనకు రంగరాజన్ మద్దతు తెలిపారు. ఆయన ఆకాంక్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే బావుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయొచ్చని.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు రంగరాజన్. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కూడా స్పందించారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు.. లడ్డూ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన అంశాలు చాలా తీవ్రమైనవని.. సమగ్రంగా విచారణ జరిపి, కారణమైనవారిని శిక్షించాలని కోరారు.

మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ లడ్డూ విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం జరుగుతోందని.. ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారాన్ని ఆపేలా చూడాలని కోర్టును కోరారు. అలాగే ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరగా.. అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపడతామని తెలిపింది. మరోవైపు ఈ లడ్డూ విషయంలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని.. దీనిపై పరువు నష్టం దావా వేస్తామని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు.. సుప్రీం కోర్టు వరకు పోరాటం చేస్తామంటున్నారు.

About amaravatinews

Check Also

అమ్మో.! అక్కడ పోస్టింగా..? అయితే కష్టమేనంటున్న బ్యూరోక్రాట్స్‌

కొందరికి లక్.. మరికొందరికి బ్యాడ్ లక్.. ఇది టెంపుల్ సిటీ సెంటిమెంట్. పొలిటికల్‌గా అదృష్టం కలిసి వస్తే బ్యూరోక్రాట్స్‌కు మాత్రం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *