విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడి చేతికి ఉన్న బ్రాస్‌లెట్ అందరినీ ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన రవి విజయవాడలోని ఇంద్రకీలాద్రికి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. ఆయన చేతికి పెద్ద బ్రాస్‌లెట్ ఉంది.. దీని బరువు ఏకంగా 1.300 కిలోలు.. విలువ సుమారు రూ.కోటి పైమాటేనని ఆయన చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై రవి చేతికి ఉన్న ఈ బ్రాస్‌లెట్‌ను భక్తులు ఆసక్తిగా తిలకించారు.
మరోవైపు ఇవాళ ఇంద్రకీలాద్రిపై వేకువజాము నుంచే భక్తుల రద్దీ కనిపిస్తోంది. నేడు దుర్గమ్మ పుట్టిన రోజు మూలానక్షత్రం కావడంతో వేకువజామున 3 గంటల నుంచే సర్వదర్శనం కల్పిస్తున్నారు. ఇవాళ అన్ని లైన్ల నుంచి ఉచిత దర్శనమే ఉంటుంది. వీఐపీ, వీవీఐపీ, అంతరాలయ దర్శనాలు ఆపేశారు అధికారులు. నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమేతంగా వచ్చి మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బంగారువాకిలి నుంచి దర్శనం చేసుకుంటారు. ముఖ్యమంత్రి అంతరాలయంలో ఉన్నా సరే దుర్గమ్మ దర్శనానికి వచ్చే సామాన్య భక్తుడి దర్శనానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇవాళ దుర్గమ్మ దర్శనానికి 2లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
విజయవాడ ఆలయంలో ఐదోరోజు భక్తుల నుంచి భారీగా ఆదాయం సమకూరింది.. మొత్తం రూ.58,97,282 వచ్చింది. రూ.500 టిక్కెట్ల ద్వారా రూ.23,71,500, రూ.300 టిక్కెట్ల ద్వారా రూ.5,97,000, రూ.100 టిక్కెట్ల ద్వారా రూ.5,06,300 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. లడ్డూలు, కుంకుమార్చన, రూ.5వేలు టికెట్లు, చండీహోమం, శ్రీచక్ర నవావరణార్చన టికెట్లు, ప్రత్యేక ఖడ్గమాలార్చన టిక్కెట్లు, ఇతర మార్గాల్లో భారీగా ఆదాయం సమకూరింది.
మరోవైపు విజయవాడ దుర్గమ్మను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించి అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందించారు. అలాగే దుర్గమ్మను సినీనటి హేమ మంగళవారం దర్శించుకున్నారు.