ముఖ్యమంత్రి చంద్రబాబు సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్‌ప్లాంటు, వరద సాయం తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోదీని, పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో హస్తినకు బయల్దేరతారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో సమావేశమవుతారు. ఆ తర్వాత రైల్వే, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలుస్తారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రోడ్డురవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో భేటీ అవుతారు. బుడమేరు సహా రాష్ట్రంలో వరదలపై కేంద్రానికి నివేదిక సమర్పించిన తర్వాత తొలిసారి ప్రధానిని చంద్రబాబు కలవనున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం, వరద సహాయ నిధులు, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలూ లేకుండా చూడడం, పోలవరం నిర్మాణానికి ముందస్తు నిధులపై కూడా చర్చించనున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal