ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ఎన్నో రోజులుగానో ఎదురుచూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామసభ కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తామని ప్రకటించారు. అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటించామన్న చంద్రబాబు.. మిగతా వాటిని కూడా నెరవేరుస్తామని అన్నారు.
మరోవైపు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది రూ.4,500 కోట్లు విలువైన పనులకు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ పథకం కింద ఈ ఏడాది 84 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుందన్నారు. కేంద్రం సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్న సీఎం.. వచ్చే ఐదేళ్లల్లో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేస్తామన్నారు. ఇంటికి తాగునీరు, విద్యుత్ కనెక్షన్లు అందిస్తామని.. పేదలకు ఇల్లు కట్టిస్తామన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు.
మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలో మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో ఈ హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారా అనే దానిపై మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఉచిత గ్యాస్ పంపిణీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో .. వచ్చే కొద్దిరోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి. వీటితో పాటుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేయడంపై టీడీపీ కూటమి దృష్టిసారించింది. వచ్చే ఒకటి, రెండు నెలల్లో వీటిలో ఏదో ఒక పథకం ప్రారంభించే ఛాన్సుంది.