ఖమ్మంలో భారీ వరదలకు కారణమదే.. ఆ విషయంపై చర్చిస్తాం: సీఎం రేవంత్‌

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోయింది. ఖమ్మం జిల్లాలో అయితే వేల మంది నిరాశ్రయులుగా మారారు. మున్నేరు వరదు ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన రేవంత్.. ఆక్రమణల వల్లే ఖమ్మం పట్టణాన్ని వరదలు ముంచెత్తాయన్నారు. గతంలో గొలుసు కట్టు చెరువులు ఉండేవని ప్రస్తుతం చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయన్నారు.

పట్టణంలో వరదలకు కారణమైన మున్నేరు రిటైర్నింగ్ వాల్ ఎత్తు పెంచే విషయంపై ఇంజనీర్ల తో మాట్లాడి చూస్తామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరం అనుకుంటే.. ఆక్రమణలు తొలగిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో కమీషన్ కాకతీయకు తెరతీసిందన్నారు. ఈ విషయాన్ని అప్పటి మంత్రి నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్ఠం చేస్తే.. ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయని ప్రశ్నించారు. వరదలపై మాజీ మంత్రి హరీశ్‌ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రేవంత్‌ పైరయ్యారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలపై హరీశ్‌ స్పందించాలన్నారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ హాస్పిటల్ కట్టారని.. వాటిని తొలగించాలని ఆయనకు హరీశ్‌ చెప్పాలన్నారు.

ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించటం వల్లే ఇంత వర్షం కురిసినా.. ప్రాణనష్టం తగ్గించగలిగామని చెప్పారు. వరద బాధితులను ఆదుకోవాలని.. కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాశామని వారి నుంచి స్పందన రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వరదల వల్ల మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించామన్నారు. ఇటువంటి విపత్తు సమయంలో గతంలో ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చి అమలు చేయలేదన్న రేవంత్.. తమది చేతల ప్రభుత్వమని ఇచ్చిన హమీలను నెరవేర్చినట్లు చెప్పారు. రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధం చేస్తున్నామన్నారు.

ఇక వరదల్లో కొట్టుకోపోయి ప్రాణాలు కోల్పోయిన మహబూబాద్ జిల్లాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని రేవంత్ పరామర్శించారు. అశ్విని కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.

About amaravatinews

Check Also

యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి ఏర్పాటు సాధ్యమేనా..? అసలు చిక్కుముడి అదేనా?

మహిమాన్విత స్వయంభూ లక్ష్మీనర్సింహ స్వామి కొలువైన చోటు యాదగిరిగుట్ట. అంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో.. 15ఏళ్లుగా పాలకమండలి లేదంటే నమ్మగలమా? కారణాలేమైనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *