వేములవాడ రాజన్న ఆలయానికి మహర్దశ.. రూ.50 కోట్లు కేటాయింపు, తొలగనున్న భక్తుల ఇబ్బందులు

తెలంగాణలో ప్రజల సంక్షేమంతో పాటుగా.. ఆలయాల అభివృద్ధికి రేవంత్ సర్కారు కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల యాదగిరిగుట్టలో పర్యటించిన సీఎం రేవంత్.. తిరుమల టీటీడీ తరహాలో ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం రూపు రేఖలు మారనున్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దర్శనానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ఎట్టకేలకు అడుగులు పడనున్నాయి.సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 20న వేములవాడలో పర్యటించనుండగా.. ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలకు రూపకల్పన చేసింది. బడ్జెట్‌లో రూ.50 కోట్ల నిధులను కేటాయించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నూతనంగా రెండో ధర్మగుండం నిర్మాణం, క్యూలైన్ల విస్తరణ, వసతి గదులు, కల్యాణ మండప నిర్మాణం, కోడెలకు ఆధునిక వసతులతో గోశాల నిర్మాణం, యాగశాల, అన్నదాన సత్రం వంటి అభివృద్ధి పనులను మెుదలు పెట్టనున్నారు.

ఇక మధ్యమానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 4,696 కుటుంబాలకు ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీచేసింది. వీటితో పాటుగా నేతన్నకు ఉపాధి కల్పించేందుకు వేములవాడలో నూలు డిపో మంజూరు చేస్తూ మరో రూ.50 కోట్లు కేటాయించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు, వేములవాడ పట్టణాన్ని టెంపుల్‌సిటీగా మార్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయింపు, పర్యాటక రంగా వేములవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.

ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు పూర్తయితే వేములవాడ రాజన్న భక్తుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో, క్యూలైన్లలో సరైన్ సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు జరిగితే భక్తుల ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. ఆలయానికి భక్తుల రాక కూడా పెరగనుంది.

About amaravatinews

Check Also

తీగలాగితే డొంక కదులుతోంది.. ఇకపై ఆటలు సాగవంటున్న సైబర్ పోలీసులు!

సైబర్ క్రైమ్.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *