కష్ట సమయంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఓ స్నేహితుడిగా ఆమెకు భారత్ సహయం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి..బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై జాతీయ మీడియాతో తిరువనంతపురం ఎంపీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో అధికార మార్పిడి విషయంలో భారత్ ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు.
‘బంగ్లాదేశ్‌తో సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలే మన ప్రాథమిక అంశం… బంగ్లాదేశ్ ప్రజల శ్రేయస్సే తొలి ప్రాధాన్యత.. ఆ తర్వాతి స్థానంలో ప్రభుత్వం, ప్రభుత్వాధినేత.. బంగ్లాదేశ్ ప్రజలకు మనం ఎప్పుడు అండగా ఉంటాం.. 1971 బంగ్లా విముక్తి పోరాటంలో వారితో ఉన్నాం.. వారితో బంధం బలమైంది.. కొన్ని సందర్భాల్లో అక్కడి ప్రభుత్వాలు స్నేహపూర్వకంగా లేనప్పటికీ ప్రజలతో సంబంధాలను మాత్రం వదులుకోలేదు.. రాబోయే కాలంలో ఆ బంధంలో ఎలాంటి క్షీణత ఉండకూడదు’ అని శశిథరూర్ పేర్కొన్నారు.