హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇక అంతర్జాతీయంగా నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మౌళిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. కొన్ని చోట్ల గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నగరంలో కొత్త అండర్‌పాసులు, ఫ్లైఓవర్లు, రహదారులు నిర్మాణానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో భారీగా ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు నిర్మించింది. గత ప్రభుత్వ అభివృద్ధిని కొనసాగిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమైంది.
అందులో భాగంగా నగరవాసులకు మరో శుభవార్త చెప్పింది. నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మెట్రోరైలు స్టేషన్ వద్ద కొత్తగా ఈ స్కైవాక్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మెట్రో జంక్షన్‌గా ఈ స్టేషన్ నుంచి నిత్యం అధిక సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఫ్లైఓవర్ కారణంగా ప్రస్తుతం స్టేషన్ నుంచి కిందికి వచ్చి రద్దీగా ఉండే రోడ్డు దాటాల్సివస్తోంది. అక్కడ అత్యంత రద్దీ ప్రాంతం కావడం.. రెండోవైపు ఎల్అండ్ టీ మెట్రోకు కేటాయించిన భూములు ఉండటంతో కనెక్టివిటీ కోసం స్కైవాక్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
Amaravati News Navyandhra First Digital News Portal