ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొన్ని పథకాలను ప్రారంభించింది. మరికొన్ని పథకాలను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాల పేరుతో మోసాలు మొదలయ్యాయి.. అసలు ప్రారంభంకాని పథకం పేరు చెప్పి ఓ అమాయకుడి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నారు సైబర్ కేటుగాళ్లు. తీరా మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.
ప్రకాశం జిల్లా పొదిలి పిచ్చిరెడ్డి కాలనీకి చెందిన బి రామకృష్ణకు.. స్థానిక వార్డు వాలంటీర్ నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను సచివాలయం నుంచి మాట్లాడుతున్నానని చెప్పగా.. ఇంతలో అతడి నంబర్ హోల్డ్‌లో పడగా.. మరో వ్యక్తి ఆ కాల్‌లోకి వచ్చాడు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్ని డబ్బులు అకౌంట్‌లో జమ అయ్యాయా అని అతడు రామకృష్ణను అడిగాడు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా పడలేదని చెప్పడంతో.. అ డబ్బుల్ని తాను జమ చేస్తానని మాయ మాటలు చెప్పాడు.
రామకృష్ణ కూడా ఇదంతా నిజమని నమ్మాడు.. ఆ డబ్బులు జమ చేయాలంటే.. ఫోన్ పే తీసి తాను చెప్పినట్లు చేయాలన్నాడు. ఈ క్రమంలో రామకృష్ణ అతడు చెప్పినట్లుగానే ఫాలో అయ్యాడు. ఇంతలో అతడి అకౌంట్ నుంచి రూ.22 వేలు సైబర్ కేటుగాడు మాయం చేశాడు. అప్పుడు మోసపోయినట్లు గుర్తించిన రామకృష్ణ వార్డు వాలంటీర్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి ప్రశ్నించాడు. తాను ఈ మోసానికి పాల్పడలేదని.. తన నంబర్ హోల్డ్‌లో ఉంచి వేరే వ్యక్తి మాట్లాడినట్లు చెప్పాడు. దీంతో బాధితుడు రామకృష్ణ పొదిలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ పథకాల పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయంటున్నారు పోలీసులు. ఇలాంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి మాట్లాడితే.. వారి తీరుపై అనుమానం వస్తే వెంటనే కాల్ కట్ చేయాలని సూచిస్తున్నారు. సైబర్ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ అసలు ప్రభుత్వం ప్రారంభించని పథకం పేరుతో మోసం చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే గత ప్రభుత్వంలో అమ్మ ఒడి డబ్బులు పడలేదని.. ఆ డబ్బుల కోసం రామకృష్ణ ఇలా చేసి ఉండొచ్చని తెలుస్తోంది.